వయనాడ్ విహంగ వీక్షణం



కేరళ రాష్ట్రం ‘దేవుడి సొంత గడ్డ’ అయితే ఆందులో ప్రకృతి కట్టుకున్న ఆలయం వాయనాడ్‌. ఎటు చూసినా పచ్చదనం, ఎత్తయిన కొండలు, కనువిందు చేసే జలపాతాలూ సందర్శకులను కట్టిపడేస్తాయి. అరుదైన వృక్షాలతో, వన్యప్రాణులతో అడుగడుగునా ఆహ్లాదాన్ని పంచుతాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి వాయనాడ్‌ను ఎంచుకోవడంతో ఈ ప్రాంతం తాజాగా పతాక శీర్షికలకు ఎక్కింది. అక్కడి పర్యాటక ఆకర్షణల మీద ఓ లుక్కేద్దాం....

ఉరికేస్తూ... దూకేస్తూ

వాయనాడ్‌ జిల్లా కేంద్రం కాల్పెట్టాకు దగ్గరలో ఉన్న ప్రధాన రైల్వేస్టేషన్‌ కోజికోడ్‌ (72 కిమీ.), సమీప విమానాశ్రయం కోజికోడ్‌లోనే ఉంది. కొచ్చి, తిరువనంతపురం, కోజికోడ్‌ల మీదుగా బస్సులు లేదా ట్యాక్సీల్లో కూడా ఈ పర్యాటక ప్రదేశాలకు చేరుకోవచ్చు.
వాయనాడ్‌లో ప్రధాన పర్యాటక ఆకర్షణ మీన్‌ముట్టి జలపాతాలు. సుమారు 984 అడుగుల ఎత్తు నుంచీ మూడు అంచెలుగా దూకే ఈ జలపాతాలు కేరళ రాష్ట్రంలో రెండవ అతి పెద్ద వాటర్‌ఫాల్స్‌. పశ్చిమ కనుమల్లోని దట్టమైన అరణ్యం మధ్యలో మీన్‌ముట్టి ఫాల్స్‌ ఉన్నాయి. ఈ చుట్టుపక్కల ఎన్నో జలపాతాలున్నా దీని ప్రత్యేకత దీనిదే. వర్షాకాలంలో ఈ ఫాల్స్‌ను ఎంత చూసినా తనివి తీరదంటారు సందర్శకులు. చుట్టూ కొండలూ, అడవుల్లో ట్రెక్కింగ్‌కు కూడా ఎంతోమంది వస్తూంటారు. ఈ జలపాతాలను చేరుకోవాలంటే రెండు కిలోమీటర్ల మేర దట్టమైన అడవుల్లో ట్రెక్కింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఇది కష్టంగా అనిపించినా, జలపాతాలను చేరుకొనేసరికి ఆ అలసటంతా మాయమైపోతుంది. అయితే ఉధృతంగా కిందికి దూకే ఈ ఫాల్స్‌లో నీటి దగ్గరకు వెళ్ళేటప్పుడు జాగ్రత్త తప్పనిసరి.

ఎలా వెళ్ళాలి? : కాల్పెట్టాకు 29 కి.మీ. దూరంలో ఉంది. రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు
  .

వేళలు : ఉదయం 9.00 నుంచి సాయంత్రం 4.00 వరకూ

నదిలో దీవుల సమూహం

ప్రకృతి సోయగాలను ఆస్వాదించాలనుకునే వారు తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశం కురువా ఐలాండ్‌. ఇది ఒక రక్షిత నదీ డెల్టా ప్రాంతం. వాయనాడ్‌ జిల్లాలోని కంబినీ నది మధ్యలో దీవుల సమూహంగా ఇది ఏర్పడింది. దాదాపు 950 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ దీవి చుట్టూ నీటి ప్రవాహాలు కనువిందు చేస్తాయి. వాటిలో విహరించడానికి బోట్లు, వెదురు తెప్పలు అందుబాటులో ఉంటాయి. ఏ సీజన్‌లోనైనా పచ్చదనంతో కురువా ప్రాంతం కళకళలాడుతూ ఉంటుంది. వెదురుతో, కలపతో నిర్మించిన వంతెనలు కూడా మరో ప్రధాన ఆకర్షణ. అరుదైన జాతుల పక్షులూ, ఔషధ మొక్కలకు ఇది నిలయం. బోట్ల మీద అన్ని దీవులనూ చుట్టేసి రావచ్చు. ప్రశాంతమైన వాతావరణంలో నడక సాగించడానికీ, ట్రెక్కింగ్‌కూ కూడా కురువా ఐలాండ్‌ అనువుగా ఉంటుంది.

ఎలా వెళ్ళాలి? కాల్పెట్టాకు 40 కి.మీ., మంథవాడికి 15 కి.మీ. దూరంలో కురువా ఐలాండ్‌ ఉంది. మంథవాడి నుంచి నేరుగా బస్సు సౌకర్యం ఉంది.
వేళలు: ఉదయం 9.00 నుంచి సాయంత్రం 5.00 వరకూ.
  జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య   వర్షాకాలంలో సందర్శకులను అనుమతించరు.

లాహిరి లాహిరిలో...!

పూకోడే సరస్సు(POOKODE LAKE) పశ్చిమ కనుమలకూ, పచ్చని అడవికీ మధ్య 13 ఎకరాల్లో విస్తరించి ఉన్న స్వచ్ఛమైన మంచినీటి సరస్సు ఇది. వాయనాడ్‌ ప్రాంతంలో పర్యాటకులు ఎక్కువగా ఎంచుకొనే గమ్యం ఇది. ఈ సరస్సు మ్యాప్‌లో భారత దేశ ఆకారంలో ఉండడం మరో విశేషం. నీలి తామరలూ, మంచి నీటి చేపలూ ఈ సరస్సు నిండా కనువిందు చేస్తాయి. అడవి మధ్యలో ఉండడంతో వన్య మృగాలూ, పక్షులూ కూడా అప్పుడప్పుడు కనిపిస్తాయి.

పూకోడే సరస్సులో బోటింగ్‌ చేస్తూ, చుట్టూ ఉన్న చక్కటి ప్రదేశాలను తిలకించడం ఒక మధురానుభూతి. ముఖ్యంగా సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో ఈ సరస్సు అందం చూసి తీరాల్సిందే. దీనికి దగ్గర్లోనే మంచి నీటి ఆక్వేరియం, పిల్లల పార్కు ఉన్నాయి. హస్త కళా వస్తువులు, సుగంధ ద్రవ్యాలు, కొబ్బరి పీచు, వెదురుతో చేసిన వస్తువులు విక్రయించే షాపింగ్‌ సెంటర్‌ కూడా ఉంది.
ఎలా వెళ్ళాలి?: కాల్పెట్టా నుంచి 15 కి.మీ దూరంలో పూకోడే సరస్సు ఉంది. బస్సు సదుపాయం అందుబాటులో ఉంటుంది.
వేళలు: ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం అయిదు వరకూ

రాళ్ళు చెప్పే కథలు!

మన దేశంలో రాతి యుగం నాటి చిహ్నాలు, శిల్పాలు ఉన్న స్థలం ఎదక్కల్‌(EDAKKAL) ఒక్కటే. ఇక్కడి గుహల్లో చిత్రించిన మానవ ఆకృతుల్లో కొన్నిటికి పైకి లేచిన జుట్టూ, మరికొన్నిటికి మాస్క్‌లూ ఉండడం విశేషం. ఇక్కడ దాదాపు నాలుగు వందల చిహ్నాలు బయటపడ్డాయి. తమిళ, బ్రహ్మీ లిపుల్లో అక్షరాలు కూడా వీటిలో కనిపిస్తాయి. సింధూనాగరికతతో ఎడక్కల్‌ గుహలకు సంబంధం ఉందని కొందరు పరిశోధకుల భావన. కాగా, శ్రీరాముడి కుమారులైన లవకుశులు వేసిన బాణాలతో ఈ రెండు గుహలు రూపొందాయన్న పౌరాణిక గాథ కూడా ఉంది. సముద్రమట్టానికి దాదాపు 1,200 అడుగుల ఎత్తున ఉన్న ఈ గుహలు క్రీస్తుపూర్వం ఆరువేల సంవత్సరం నాటివిగా పురావస్తు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అపురూపమైన ఈ గుహలను తిలకించడానికి ఎందరో సందర్శకులు వస్తూ ఉంటారు. ట్రెక్కింగ్‌ ప్రియులకు కూడా ఇది ఎంతో అనువైన గమ్యం.

ఎలా వెళ్ళాలి?: వాయనాడ్‌ జిల్లా కేంద్రం కాల్పెట్టాకు 65 కి.మీ. దూరంలో ఉంది. కాల్పెట్టా నుంచి అంబుకుట్టిమల కొండ వరకూ బస్సులు ఉన్నాయి. అక్కడి నుంచి సుమారు నలభై అయిదు నిమిషాలపాటు నడచి గుహల్ని చేరుకోవాల్సి ఉంటుంది. కొండ మధ్య వరకూ జీపులు ఉంటాయి.
వేళలు: ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 వరకూ

చెంబ్రా శిఖరం - ట్రెక్కర్లకు స్వర్గం

వాయనాడ్‌ అనగానే టూరిస్టులకు వెంటనే గుర్తొచ్చే ప్రదేశం చెంబర్‌ శిఖరం. సుమారు 2,100 మీటర్ల ఎత్తయిన ఈ శిఖరంపై నుంచి చూస్తే వాయనాడులోని దాదాపు అన్ని ప్రదేశాలూ కనిపిస్తాయి. శిఖరాగ్రం నుంచి కేరళలోని కోజికోడ్‌, మల్లప్పురం, తమిళనాడులోని నీలగిరి జిల్లాలు దర్శనమిస్తాయి. ఎటుచూసినా పచ్చదనంతో ఆహ్లాదంగా ఉండే చెంబ్రా శిఖరంపై ట్రెక్కింగ్‌ చెయ్యడానికి విదేశాల నుంచి కూడా ఔత్సాహికులు వస్తూంటారు. శిఖరం ఎక్కుతూ ఉంటే మధ్యలోంచీ గుండె ఆకారంలో ఉన్న చెరువు కనిపిస్తుంది. దీన్ని ‘హృదయ తటాకం(heart shaped lake)’ అంటారు. ఇది ఎప్పటికీ ఎండిపోదని స్థానికులు చెబుతారు. ఇక్కడ ప్రధాన ఆకర్షణల్లో ఇదొకటి. రాత్రివేళల్లో ఈ పర్వతం చుట్టూ వన్య ప్రాణులు తిరుగుతూ ఉంటాయి. కాబట్టి రాత్రివేళల్లో శిఖరం మీద బస చెయ్యడానికి అనుమతి లేదు. ఏ సీజన్‌లోనైనా చెంబ్రా పీక్‌ను సందర్శించవచ్చు. అయితే వర్షాకాలంలో పర్వతారోహణ, ట్రెక్కింగ్‌ అంత అనువైనవి కావు. పది మంది సభ్యుల బృందానికి రూ.500 చొప్పునా, విదేశీ బృందాలు రూ. 1,000 చొప్పునా ట్రెక్కింగ్‌ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

ఎలా వెళ్ళాలి?: కాల్పెట్టా నుంచి 22 కి.మీ. దూరంలో ఉంది. కాల్పెట్టా నుంచి నేరుగా బస్సు సౌకర్యం ఉంది.
  
వేళలు: ఉదయం 7.00 నుంచి సాయంత్రం 5.00 వరకూ

ఇవీ చూడండి 

  • వాయనాడ్‌లో హిల్‌ స్టేషన్లకు కొదవలేదు. 
  • లక్కిడి, నీలిమల వ్యూపాయింట్లు, బ్రహ్మగిరి కొండల మీద పక్షిపాతాళం పక్షుల అభయారణ్యం, తిరునెల్లి మహావిష్ణు ఆలయం, బాణాసుర సాగర్‌ డ్యామ్‌, ముతంగా వన్యప్రాణుల అభయారణ్యం తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశాల్లో కొన్ని మాత్రమే.
మరింత సమాచారం కోసం 
వెబ్సైటు : http://wayanadtourism.org
వయనాడ్ టూరిస్ట్ గైడ్ మ్యాప్ Click Her
వయనాడ్ గురించి E-Book : Click Here

Comments