సేవ + యాత్ర = Voluntourism

విహారం అనగానే.. కుటుంబంతో యాత్రో.. స్నేహితులతో షికారో.. అనుకుంటాం. చార్రితక నెలవులు, ఆధ్యాత్మిక కేంద్రాలే పర్యాటక ప్రాంతాలని భావిస్తాం. సేవాపథంలోనూ విహారానికి చోటుంది. సేవామార్గంలో సాగే యాత్రలు.. ఆత్మసంతృప్తినిస్తాయి. మరెందుకాలస్యం మానవసేవతో పాటు మాధవసేవ కూడా చేసేద్దాం పదండి.

సేవామార్గాలా.. ఎక్కడుంటాయి? అక్కడేం చేయాలి? ఇలా ఎన్నో సందేహాలు. వీటన్నిటికీ సమాధానం వలంటూరిజం. పర్యటనల్లో సేవలు చేయడమే వలంటూరిజం. పాశ్చాత్యదేశాల్లో ఏనాడో మొదలైన ఈ సంస్కృతి ఇప్పుడు ట్రావెల్‌ ట్రెండ్‌. మన దేశంలోనూ సేవాయాత్రలు సాగుతున్నాయి. తోచిన సేవ చేయడానికి ఔత్సాహికులు ఏ తావుకో వెళ్లిపోతున్నారు. ఎక్కడెక్కడి దేశాల వారో భారతావనికి వస్తున్నారు. అయితే ట్రావెల్‌ ఆపరేటర్ల కన్నా స్వచ్ఛంద సంస్థలే వలంటూరిజాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాయి. తమ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పర్యాటకులకు పాల్గొనే అవకాశం కల్పిస్తున్నాయి.

➤ ఖర్చూ తక్కువే
వలంటూరిజంలో వినోదానికేం తక్కువుండదు. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి స్వచ్ఛంద సంస్థలు. ఇక్కడ అప్పగించిన పనులు చేస్తూ పోవడమే పర్యాటకుల పని. ఆశ్రమాల్లో, అడవి తల్లి ఒడిలో, మారుమూల పల్లెలో.. సేవలు అవసరమైన చోట భోజనం, బస ఏర్పాట్లుంటాయి. వీటికి గాను కొంత మొత్తం చెల్లించాల్సి వస్తుంది. సాధారణ పర్యటనకయ్యే ఖర్చు కన్నా ఇది తక్కువే! పైగా.. కొత్త అనుభవం లభిస్తుంది. దేశవిదేశాల నుంచి వచ్చిన పర్యాటక సేవకులను కలుసుకునే అవకాశం దొరుకుతుంది.

➤ జీవిత పాఠాలు..
నలుగురి కోసం చేసే పర్యటనలివి! వీటిని నిర్వహించే సంస్థలు పర్యాటకుల అభ్యర్థనను అంత తేలిగ్గా మన్నించవు. ఆసక్తి కలవారినే ఆహ్వానిస్తాయి. మానసికంగా సంసిద్ధంగా ఉంటే తప్ప.. సేవాయాత్ర కొనసాగించలేం. విశాల హృదయంతో  ముందడుగు వేసినవారికి యాత్ర ఆద్యంతం అద్భుతమైన అనుభూతి ఇస్తుంది. అందమైన పర్యటనగానే కాదు.. అద్భుతమైన జీవిత పాఠంగా మిగిలిపోతుంది.

➤ సహృదయులకు స్వాగతం
కన్యాకుమారి నుంచి కశ్మీరం వరకు ఎన్నో సంస్థలు వలంటూర్లు నిర్వహిస్తున్నాయి. రెండు వారాల నుంచి రెండు నెలల నిడివితో కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి. వ్యవసాయం, పారిశుద్ధ్యం, విద్యాబోధన, హ్యాండీక్రాఫ్ట్‌ వర్క్‌షాప్‌లు, మెడికల్‌ క్యాంప్‌లు, మౌలిక వసతుల కల్పన, వన సంరక్షణ, గ్రామాల్లో అవగాహన సదస్సులు ఇలా రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నాయి.



హిమగిరుల్లో..


➡️ లద్దాఖ్‌లో 17,000 ఫీట్‌ ఫౌండేషన్‌ ఏటా వలంటీర్లను పర్యటనకు ఆహ్వానిస్తుంటుంది. లద్దాఖ్‌ లోయల్లో బోధన, మౌలిక వసతుల కల్పనలో టూరిస్టులను భాగస్వాములను చేస్తోంది. వేసవిలో విహారానికి వెళ్లదలచిన వాళ్లు.. 17000ఫీట్‌ సంస్థ పిలుపు అందుకుంటే.. హిమగిరుల్లో కాలాన్ని చల్లగా కరిగించేయొచ్చు. అక్కడివారికి తోచినంత సాయమూ చేయవచ్చు. ఫీజు, ఇతర వివరాలకు http://17000ft.org వెబ్‌సైట్‌ను సందర్శించండి.
➡️ హిమాలయన్‌ ఎడ్యుకేషన్‌ లైఫ్‌లైన్‌ ప్రోగ్రాం (హెల్ప్‌) సంస్థ సిక్కిం, లద్దాఖ్‌తో పాటు పశ్చిమ్‌ బంగా, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో కొన్ని చోట్ల, నేపాల్‌లోనూ సేవాయాత్రలు నిర్వహిస్తోంది. వివరాలకు  www.help-education.org వెబ్‌సైట్‌ను సందర్శించండి.

➡️ హిమాచల్‌ప్రదేశ్‌లోని స్పీతి లోయ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి. మనాలికి 195 కి.మీ. దూరంలో ఉండే అందమైన లోయలో విహారం చేస్తూనే సేవలు చేసే భాగ్యం కల్పిస్తోంది.. స్పీతి ఎకోస్పేర్‌ సంస్థ. మరింత సమాచారం కోసం www.spitiecosphere.com వెబ్‌సైట్‌ చూడండి.


స్వామి కార్యంలో.. స్వయంగా..


తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం గొప్ప భాగ్యంగా భావిస్తారంతా! మరి ఆయన సన్నిధిలోనే ఉండి.. స్వామి కార్యంలో పాలుపంచుకునే అవకాశం రావడమంటే అదృష్టమే! భక్తులకు అలాంటి అవకాశం కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీవారి సేవలో తరిస్తున్న సేవకాగణం దాదాపు అన్ని విభాగాల్లోనూ కనిపిస్తుంటుంది. సేవకు వచ్చిన వారికి భోజనం, బస ఉచితం. చివరి రోజు స్వామి దర్శనం కల్పిస్తారు. శ్రీవారి సేవకులు 3 రకాలు...
1. శ్రీవారి సేవకులు (జనరల్‌)
2. పరకామణి సేవ
3. లడ్డూ ప్రసాద సేవ
శ్రీవారి సన్నిధిలో..
శ్రీవారి సాధారణ సేవకులు 15 మందితో బృందంగా గానీ, ఒక్కొక్కరుగా కూడా పాల్గొనొచ్చు. అన్నప్రసాదం, ఉద్యోగుల క్యాంటీన్‌, కూరగాయలు తరగడం, ఫుడ్‌ కోర్ట్సు, గోసేవ, పూలంగి సేవ, వైకుంఠం 2 అన్నప్రసాదం, వైకుంఠం 2 వరుస లైన్లు, ఆరోగ్యం, విజిలెన్స్‌, కల్యాణకట్ట, ఏఎన్‌సీ విచారణ, సప్తగిరి సత్రాలు, కొబ్బరికాయలు అమ్మకం, పుస్తకాల విక్రయం, హెల్ప్‌డెస్క్‌, పాలపంపిణీ, గుడిశుభ్రత, తిరునామం జనరల్‌ విభాగంలోని సేవలు.  ‌www.tirumala.org వెబ్‌సైట్‌ ‌సైట్‌లోకి వెళ్లి పేరు నమోదు చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో శ్రీవారిసేవా సర్వీసు లింక్‌ క్లిక్‌ చేస్తే వివిధ సేవలు, ఖాళీగా ఉన్న రోజుల వివరాలు కనిపిస్తాయి. సేవకులుగా నమోదు చేసుకున్న వారు తిరుపతి, తిరుమలలో శ్రీవారి సేవక్‌ విభాగాన్ని సంప్రదించాలి.
* హిందువులు మాత్రమే సేవకు అర్హులు
* సేవలు 3/4/7 రోజులుగా ఉంటాయి.
* 3 రోజుల సేవకు వచ్చేవారి వయసు 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
* మిగతా సేవల్లో పాల్గొనదలచిన వారి వయసు 18 నుంచి 60 ఏళ్లలోపు ఉండాలి.
* సేవకులు ఆధార్‌కార్డు వెంట తెచ్చుకోవాలి.
* తితిదే రూపొందించిన వస్త్రాలు మాత్రమే ధరించాలి.

కానుకల లెక్కింపులో
పరకామణి సేవకు వచ్చే వారు స్వామి వారి నగదు హుండీలను లెక్కించాల్సి ఉంటుంది. ప్రయివేటు, పబ్లిక్‌ బ్యాంకు సెక్టార్లు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారిని సేవకు తీసుకుంటారు. వయసు 35 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి. 8 రోజుల పాటు సేవకు వచ్చేలా చూసుకోవాలి. కచ్చితంగా నిక్కరు... బనియను మాత్రమే ధరించి... పరకామణిలోకి వెళ్లాలి. రెండు నెలల ముందు ఏ తేదీల్లో సేవకు వీలుందో కోటాను విడుదల చేస్తారు.
మన చేతుల మీదుగా మహాప్రసాదం
లడ్డూ ప్రసాద సేవకు వచ్చే వారు లడ్డూ కౌంటర్లలో పనిచేయాలి. కొన్ని కౌంటర్లు వీరే నిర్వహిస్తారు. కంప్యూటరు పరిజ్ఞానం కలిగిన వారు, ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాలు చేసేవారు ఈ సేవకు రావొచ్చు. 18 నుంచి 65 ఏళ్ల లోపు వయసుండాలి.

వ్యవ‘సాయం’

* వలంటూరిజంలో వ్యవసాయం యాత్రలు జోరుగా సాగుతాయి. ‘వర్కింగ్‌ వీకెండ్స్‌ ఆన్‌ ఆర్గానిక్‌ ఫార్మ్స్‌’ (వూఫ్‌) సంస్థ దేశవ్యాప్తంగా వ్యవసాయ యాత్రలు ఏర్పాటు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ వూఫ్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. వారాంతాల్లో పల్లెలకు వెళ్లి వ్యవసాయ పనులు చేసేయొచ్చు. పట్నవాసంతో విసిగిన వారికి పల్లె‘టూరు’ సరికొత్త ఉత్సాహాన్నిస్తుంది. సంస్థలో సభ్యత్వం, ఇతర వివరాల కోసం www.wwoofindia.org/ వెబ్‌సైట్‌ చూడండి.
* తమిళనాడు విల్లిపురం జిల్లాలోని ఆరోవిలి పట్టణంలోనూ వ్యవసాయ క్షేత్ర దర్శన అవకాశం ఉంది. ఆరోవిల్‌ సంస్థ ఆధ్వర్యంలో ఏడాది పొడవునా వలంటూరిజానికి అవకాశం ఉంది. ఇందులో భాగస్వామ్యం కావాలనుకుంటే http://auroville-learning.net వెబ్‌సైట్‌ సందర్శించండి.

జంతువుల రక్షకులుగా


చెన్నైలో మొసళ్ల పార్కు సాహసవంతులను స్వాగతిస్తోంది. మద్రాస్‌ క్రొకడయిల్‌ బ్యాంక్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పనులు కొనసాగుతాయి. మొసళ్ల ఎన్‌క్లోజర్స్‌ శుభ్రం చేయడం, వాటికి ఆహారం అందజేయడం లాంటివి చేయాలి. 
వివరాలకు madrascrocodilebank.org వెబ్‌సైట్‌ చూడండి.
* వన్యమృగాలు, పర్యావరణ సంరక్షణకు కృషి చేస్తోంది వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఇండియా స్వచ్ఛంద సంస్థ. మహారాష్ట్ర, దిల్లీ, కేరళ, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌ తదితర రాష్ట్రాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
 వివరాలకు  volunteers.wwfindia.org/ వెబ్‌సైట్‌లో మరింత సమాచారం లభిస్తుంది.

Comments