బుద్ధుడి అడుగుజాడల్లో...

లోకానికి శాంతినీ, అహింసనూ బోధించిన మహనీయుడు గౌతమ బుద్ధుడు. భారతదేశం కేంద్రంగా ఆయన ప్రబోధించిన బౌద్ధం ప్రధానంగా తూర్పు దక్షిణ, ఈశాన్య ఆసియా దేశాల్లో వ్యాప్తి చెందింది. వివిధ దేశాల్లో సందర్శనీయమైన బౌద్ధ స్థలాలు అనేకం ఉన్నాయి. వాటిలో నాలుగు ప్రదేశాలను బౌద్ధులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. బుద్ధుడి జీవితంతో అవి ముడిపడి ఉండడమే దీనికి కారణం. భారత ఉపఖండంలోనే ఉన్న ఆ నాలుగూ...

⧪ శాంతిమూర్తి జన్మభూమి

బుద్ధుడి జన్మస్థలంగా నేపాల్‌ దేశంలోని లుంబిని ఖ్యాతి జగద్విదితం. బుద్ధుడు శాక్య వంశానికి చెందినవాడు. వారి రాజధాని కపిలవస్తుపురం. ఆ నగరం నుంచి ప్రసవం కోసం పుట్టింటికి బయలుదేరిన మాయాదేవి దారిలో విశ్రాంతి తీసుకోవడానికి లుంబిని వనంలో ఆగిందనీ, అక్కడ ఆమెకు ప్రసవమై గౌతముడు జన్మించాడనీ బౌద్ధ గాథలు చెబుతున్నాయి. చారిత్రకంగా కూడా లుంబినికి ఎంతో ప్రాధాన్యం ఉంది.

సుమారు క్రీస్త్తుపూర్వం ఆరో శతాబ్దంలో కలపతో నిర్మించిన మాయాదేవి ఆలయ అవశేషాలు 2013లో జరిపిన తవ్వకాల్లో బయటపడ్డాయి. ఇక ఇక్కడ మాయాదేవి ప్రాచీన ఆలయంతో పాటు పుష్కరణినీ, అశోకుడు ఏర్పాటుచేయించిన స్తంభాన్నీ కూడా పర్యాటకులు సందర్శిస్తారు. గౌతముణ్ణి కనడానికి ముందు రోజు రాత్రి పుష్కరణిలో మాయాదేవి స్నానం ఆచరించిందనీ, గౌతముడి తొలి స్నానం కూడా అందులోనే జరిగిందనీ విశ్వాసం ఉంది.

ఇక జపాన్‌కు చెందిన ఆర్కిటెక్ట్‌ డిజైన్‌ చేసిన పవిత్రమైన లుంబినీ గార్డెన్స్‌ ప్రాంతంలో బౌద్ధాన్ని అనుసరించే అనేక దేశాలకు చెందిన ఆరామాలు, ప్రపంచ శాంతి, సమైక్యతా కేంద్రం ఉన్నాయి. దీన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ‘UNESCO’ ప్రకటించింది.
  • ఎక్కడ?: నేపాల్‌లోని లుంబినీలో
  • ఎలా వెళ్ళాలి?: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌, వారణాసి తదితర నగరాల నుంచి భారత్‌-నేపాల్‌ సరిహద్దు పట్టణం సోనౌలీకి బస్సులున్నాయి. సోనౌలీకి సుమారు 28 కి.మీ. దూరంలో ఉన్న నేపాల్‌లోని లుంబినికీ నేరుగా బస్సు సౌకర్యం ఉంది. లుంబినికి సమీప విమానాశ్రయం అక్కడికి 22 కి.మీ. దూరంలోని భైరహ్వా (సిద్ధార్థనగర్‌)లో ఉంది. నేపాల్‌ను సందర్శించాలనుకొనే భారతీయులకు వీసా అవసరం లేదు. చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డును తీసుకువెళితే సరిపోతుంది.
  • ఇవీ చూడాల్సినవి: మాయాదేవి ఆలయం, బుద్ధుడు జన్మించినట్టు విశ్వసించే గది, లుంబిని ఉద్యానం, అశోక స్తంభం, ప్రపంచ శాంతి, సమైక్యతా కేంద్రం.

 


 ⧪ తొలి ఉపదేశ స్థలి

జ్ఞానోదయాన్ని పొందిన బుద్ధుడు అయిదు వారాల తరువాత బుద్ధ గయ నుంచి సారనాథ్‌కు చేరుకున్నాడు. అక్కడ తన మొదటి ధర్మోపదేశం చేశాడు. ‘ధర్మచక్రపరివర్తన’ ద్వారా తన అనుచరులకు ఆయన మార్గనిర్దేశం చేసిన చోటు ఇది. ఆ విధంగా బౌద్ధ ధర్మానికి తొలి బీజాలు సారనాథ్‌లో పడ్డాయి. ఇక్కడ అశోకుడు నిర్మించిన ధర్మ స్తూపం జగత్ప్రసిద్ధి చెందింది.

నాలుగు సింహం తలలూ, మధ్యన ఇరవై నాలుగు ఆకులతో కూడిన చక్రం ఉంటాయి. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత మన జాతీయ పతాకంలో ఈ చక్రానికి చోటు లభించింది. నాలుగు తలల సింహం ఆకృతి భారత ప్రభుత్వ అధికార చిహ్నం అయింది. సారనాథ్‌లో ధమ్మెక స్తూపంతో సహా ఎన్నో స్తూపాలు ఉన్నాయి.

థాయ్‌ బౌద్ధవిహారంలో 80 అడుగుల ఎత్తులో ఉన్న బుద్ధుడి విగ్రహం చూపరులను అబ్బురపరుస్తుంది. ఇండో-థాయిలాండ్‌ ఉమ్మడి నిర్మాణం ఇది. అనేక దేశాలకు చెందిన బౌద్ధ ఆరామాలు ఇక్కడ కనిపిస్తాయి.
  • ఎక్కడ?: ఉత్తరప్రదేశ్‌లోని సారనాథ్‌లో
  • ఎలా వెళ్ళాలి?: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల నుంచి వారణాసికి నేరుగా రైలు సౌకర్యం ఉంది. అక్కడికి సుమారు 10 కి.మీ. దూరంలో ఉన్న సారనాథ్‌కు రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం వారణాసిలో ఉంది.
  • ఇవీ చూడాల్సినవి: 80 అడుగుల బుద్ధ విగ్రహం, సారనాథ్‌ ఆర్కియాలజీ మ్యూజియంలో ఉన్న నాలుగు సింహాల అశోక చిహ్నం, టిబెటియన్‌ ఆలయం, అశోక స్తూపం.




⧪ నిర్వాణ సోపానం

లోకంలోని ఆకలి, జరామరణాలను చూసి చలించిన రాజకుమారుడైన గౌతముడు భార్యాబిడ్డలనూ, రాజ్యాన్నీ విడిచి సత్యాన్ని వెతుక్కుంటూ ప్రయాణించి, బుద్ధగయలోని మర్రిచెట్టు కింద ధ్యానంలో కూర్చుంటాడు. నలభై తొమ్మిది రోజుల తరువాత ఆయనకు జ్ఞానోదయం కలిగింది. అలా గౌతముడు నిర్వాణాన్ని పొంది, బుద్ధుడిగా అవతరించిన ప్రదేశం బుద్ధగయ.

ఆయన ధ్యానానికి నీడనిచ్చిన మర్రి చెట్టు బోధి వృక్షంగా ప్రసిద్ధి చెందింది. బౌద్ధులకు ఆధ్యాత్మిక గమ్యంగా మారింది. ప్రపంచం నలుమూలల నుంచీ పర్యాటకులు బుద్ధగయ సందర్శనకు వస్తూ ఉంటారు. వివిధ బౌద్ధదేశాలకు చెందిన నిర్మాణ శైలితో ఆయా దేశాలవారు ఇక్కడ ఆలయాలనూ, ఆరామాలనూ నిర్మించారు. మహాబోధి ఆలయం వీటిలో ప్రధానమైనది. బుద్ధుడి కాలంనాటి చెట్టుకు చెందినదిగా భావించే బోధి వృక్షాన్ని పవిత్రంగా పరిగణిస్తారు.

బుద్ధుడి జన్మదినమైన వైశాఖ పౌర్ణమి రోజున విశేష సంఖ్యలో బౌద్ధులు బుద్ధగయకు వచ్చి, బుద్ధుడిని ఆరాధిస్తారు. ధ్యానముద్రలో ఉన్న మహా బుద్ధ విగ్రహం ఇక్కడ మరో ప్రత్యేక ఆకర్షణ. ఇది 84 అడుగుల (25మీటర్ల) ఎత్తులో ఉంటుంది. ఈ ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా ‘యునెస్కో’ ప్రకటించింది.

  • ఎక్కడ?: బీహార్‌ రాష్ట్రంలోని గయకు సుమారు 15 కి.మీ. దూరంలో
  • ఎలా వెళ్ళాలి?: తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన ప్రాంతాల నుంచి గయకు నేరుగా వీక్లీ రైళ్ళు ఉన్నాయి. గయలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.
  • ఇవీ చూడాల్సినవి: బోధి వృక్షం, 25 మీటర్ల ఎత్తైన బుద్దుడి విగ్రహం, మహాబోధి ఆలయం.


⧪ ఆఖరి మజిలీ

బౌద్ధ ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం సాగిస్తున్న బుద్ధుడు అస్వస్థుడై, దేహత్యాగం చేసిన చోటు కుశీనగర్‌. బౌద్ధులు జీవితంలో ఒకసారైనా కుశీనగర్‌ను సందర్శించాలని కోరుకుంటారు. బుద్ధుడి భౌతికకాయానికి ఇక్కడే అంతిమ సంస్కారాలు చేశారు. దీనికి చిహ్నంగా నిర్మించిన పరినిర్వాణ స్తూపంలో సుమారు ఏడు అడుగుల ‘మృత బుద్ధ’ విగ్రహం శయన భంగిమలో ఉంటుంది. ఇక్కడ కూడా అశోకుడు స్తూపాన్ని నిర్మించాడు. ప్రధాన పరినిర్వాణ ఆలయం వెనుక ముఖ్యమైన స్తూపం ఉంది.

దాన్ని ‘నిర్వాణ స్తూపం’ అంటారు. దీనితోపాటు ఇతర అనేక స్తూపాలు, ఆలయాలు, ధ్యానమందిరాలు ఇక్కడ ఉన్నాయి. ముఖ్యంగా ఇండో-జపాన్‌-శ్రీలంక ఆలయం అద్భుత శిల్పకళా నైపుణ్యంతో అబ్బురపరుస్తుంది. కేవలం చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం మాత్రమే కాదు, ఆహ్లాదంగా గడపడానికి వచ్చే పర్యాటకులకు కూడా అనువైన గమ్యం ఇది.
  • ఎక్కడ?: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని కుశీనగర్‌లో
  • ఎలా వెళ్ళాలి?: తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన ప్రాంతాల నుంచి గోరఖ్‌పూర్‌కు నేరుగా రైలు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి సుమారు 55 కి.మీ. దూరంలో ఉన్న కుశీనగర్‌కు రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం గోరఖ్‌పూర్‌లో ఉంది.
  • ఇవీ చూడాల్సినవి: మృత బుద్ధ విగ్రహం, ఇండో-జపాన్‌-శ్రీలంక ఆలయం, పార్కు మాదిరిగా నిర్మించిన ధ్యానమందిరం, పురావస్తు శాఖ మ్యూజియం.


Comments