వర్షంలో...విహరిద్దామా


చినుకు పడితే పుడమి పరిమళిస్తుంది..నీటి ముత్యాలతో రెమ్మలన్నీ మెరిసిపోతుంటాయి. కొమ్మను కదిపితే చాలు.. చిరుజల్లు కురిసి తనువంతా తడిసిపోతుంది. ఈ అనుభవం ఇంటి వాకిట్లో ఎదురైతేనే మనసు పులకించిపోతే.. మేఘాలను ముద్దాడే కొండ కొనల్లో తారసపడితే ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి. అందుకే, రుతురాగాలు మొదలవుతున్న వేళ.. ఆనందపు శిఖరాలకు చేరుకోండి.. వానజల్లులో కేరింతలు కొడుతూ..వరుణ సందేశాన్ని అందుకోండి.

 వనంలో వాలిపోదాం - వాల్పరాయ్‌, తమిళనాడు 

తమిళనాడులోని అన్నామలై కొండల్లో ఉన్న అందమైన ప్రాంతం వాల్పరాయ్‌. ఇది కోయంబత్తూరు జిల్లాలో అన్నామలై టైగర్‌ రిజర్వ్‌లో భాగమై ఉంది. సముద్ర మట్టానికి 3,500 అడుగుల ఎత్తులో ఉన్న వాల్పరాయ్‌కి ఏడాది పొడవునా పర్యాటకుల తాకిడి ఉంటుంది. దట్టమైన అడవి, ఎటు చూసినా కొండలు, కాఫీ, తేయాకు తోటలతో అలరించే ఈ ప్రాంతం.. తొలకరి వేళ మరింత అద్భుతంగా దర్శనమిస్తుంది. కూజంగల్‌ నది జోరు, చిన్న చిన్న జలపాతాల హోరు ప్రకృతిగీతాన్ని వినిపిస్తాయి. ఏనుగులు, జింకలు, నెమళ్లు, రకరకాల పక్షులు జీవవైవిధ్యాన్ని కళ్లముందుంచుతాయి.
చూడాల్సినవి: 
* వాల్పరాయ్‌కి 60 కిలోమీటర్ల దూరంలో ప్రముఖ షూటింగ్‌ లొకేషన్‌ పొల్లాచి ఉంటుంది. ఇక్కడికి వెళ్లే దారి పంటపొలాలతో అద్భుతంగా ఉంటుంది. దారిలో మరపురాని మలుపులు ఎన్నో ఉంటాయి. ఈ మార్గంలోని అలియార్‌ డ్యామ్‌ సందర్శనీయ స్థలం.
* అన్నామలై పులుల సంరక్షణ కేంద్రం.. చూడాల్సిన ప్రదేశం. పులులు, చిరుతలు, ఏనుగులతో పాటు మరెన్నో జంతువులను ఇక్కడ చూడొచ్చు.
చేరుకునేదిలా: వాల్పరాయ్‌.. కోయంబత్తూరుకు 108 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నుంచి కోయంబత్తూరు రైళ్లున్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పొల్లాచి మీదుగా వాల్పరాయ్‌ వెళ్లొచ్చు.

జలపాతాల సిరి - సిర్సీ, కర్ణాటక 

దేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో కర్ణాటకలోని సిర్సీ  ఒకటి. పడమటి కనుమల్లో, సముద్ర మట్టానికి 2,500 అడుగుల ఎత్తులో ఉంటుందీ ప్రాంతం. ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్న సిర్సీని ‘జలపాతాల కేంద్రం’గా అభివర్ణిస్తారు. ఈ పట్టణానికి  40 కిలోమీటర్ల పరిధిలో పేరున్న జలపాతాలు పదికిపైగానే ఉన్నాయి. చిన్నాచితకా జలపాతాలు కోకొల్లలు. నదులు, వాగులు, సెలయేళ్లు పర్యాటకులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతాయి. హుబ్లీ నుంచి సిర్సీకి వెళ్లే దారి పచ్చదనంతో కనువిందు చేస్తుంది. దారిపొడవునా జింకల గుంపులు, నెమళ్ల గెంతులు చూడొచ్చు. కారుమబ్బులు కమ్ముకొచ్చిన వేళ.. కొండల మీదుగా చల్లని గాలులు వీస్తుండగా.. సిర్సీ అందాలు రెట్టింపవుతాయి. రెండు రోజులు ఉండగలిగితే.. ఈ పర్యాటక కేంద్రం చుట్టుపక్కల విశేషాలన్నీ చూసి రావొచ్చు.
చూడాల్సినవి 
* 16వ శతాబ్దంలో నిర్మించిన మరికాంబ దేవాలయం చూడదగినది. ఇక్కడి అమ్మవారి విగ్రహం కలపతో చేసినది కావడం విశేషం. ఇక్కడికి సమీపంలో గణపతి గుడి ఉంటుంది.
* 381 అడుగుల ఎత్తు నుంచి జాలువారే ఊంచల్లీ జలపాతం అద్భుతంగా ఉంటుంది. ఏ కాలంలో అయినా కనువిందు చేస్తుంది. బ్రిటిష్‌ అధికారి లిషింగ్టన్‌ గుర్తించడంతో దీనిని ఆయన పేరుతో పిలుస్తారు.
* సిర్సీ పరిసరాల్లో ఉన్న మరో అద్భుతం సహస్రలింగ క్షేత్రం. శాలమల నది ప్రవాహంలో వెయ్యికిపైగా లింగాలు కనిపిస్తాయి. ప్రతి లింగానికి ముందు నందిని కూడా చూడొచ్చు.
* సిర్సీకి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనోహరమైన ప్రదేశం యాణ. విభూతి జలపాతాలు ఇక్కడ ప్రధాన ఆకర్షణ. పచ్చని వృక్షాల మధ్య ఆకాశాన్నంటుతున్నాయా అన్నట్టుండే రాతి పర్వతాలు.. విచిత్రాకృతుల్లో ఆశ్చర్యం కలిగిస్తాయి.
చేరుకునేదిలా:
 సిర్సీ.. హుబ్లీ నుంచి 105 కి.మీ. దూరంలో ఉంటుంది. హైదరాబాద్‌, విజయవాడ,విశాఖపట్టణం నుంచి హుబ్లీ వరకు రైళ్లో వెళ్లాలి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సిర్సీ చేరుకోవచ్చు.
  

మేఘ సందేశం - మూడు గిరుల మధ్య - అమర్‌కంటక్‌, మధ్యప్రదేశ్‌ 

మధ్యభారతంలోని వింధ్య, సాత్పురా, మైకాల్‌ పర్వతాలు కలిసే చోటున్న అమర్‌కంటక్‌ వర్షాకాల విడిదిగా పేరొందింది. వనసీమలో ఉన్న ఈ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రం తొలకరి రాకతో సుందరంగా మారిపోతుంది. మధ్యప్రదేశ్‌ అనూప్పుర్‌ జిల్లా కేంద్రానికి 85 కి.మీ. దూరంలో ఉంటుంది. తీర్థరాజంగా పేరున్న అమర్‌కంటక్‌ నర్మదా నదికి పుట్టినిల్లు. నర్మద ఉద్గమ స్థానంలో మందిరం ఉంది. పరిసరాల్లో ఆలయాలు ఎన్నో ఉన్నాయి. చుట్టూ ఉన్న వనంలో కపిలధార, దూద్‌ధార వంటి జలపాతాలను చూడొచ్చు.
చేరుకునేదిలా:
* హైదరాబాద్‌ నుంచి జబల్‌పూర్‌కు నాన్‌స్టాప్‌ విమాన సర్వీసులు ఉన్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అమర్‌కంటక్‌ (228 కి.మీ.) చేరుకోవచ్చు.
* హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నుంచి బిలాస్‌పూర్‌కు రైళ్లున్నాయి. అక్కడి నుంచి పెండ్రారోడ్‌ (105 కి.మీ.) వరకు రైలులో వెళ్లాలి. పెండ్రారోడ్‌ నుంచి బస్సులు, ట్యాక్సీల్లో అమర్‌కంటక్‌ (32 కి.మీ.) చేరుకోవచ్చు.
  
అమర్‌కంటక్‌ సందర్శనకు మధ్యప్రదేశ్‌ పర్యాటక శాఖ హైదరాబాద్‌ నుంచి మూడు రోజుల ప్యాకేజీ నిర్వహిస్తోంది. హైదరాబాద్‌ నుంచి జబల్‌పూర్‌ వరకు విమానంలో తీసుకెళ్తారు. అక్కడి నుంచి ఏసీ వాహనంలో యాత్ర కొనసాగుతుంది.
ప్యాకేజీ ధర: రూ.7,350 (ఒక్కరికి)
Web Site : http://www.mptourism.com/
మరిన్ని వివరాలకు 98660 69000 నెంబర్‌ను సంప్రదించండి.

మనసు వేగం పెరగనీ - వేగమాన్‌, కేరళ

కేరళను తాకే దాకా దోబూచులాడే రుతుపవనాలు.. మలయాళసీమను చేరగానే ఊపందుకుంటాయి. వనాలతో నిండి ఉన్న కేరళ.. మేఘాలను ఆగమేఘాల మీద ముందుకు నడిపిస్తాయి. అలా రుతురాగాల వేగాన్ని పెంచే ప్రదేశాల్లో ఒకటి వేగమాన్‌. ఎర్నాకులం, ఇడుక్కి సరిహద్దుల్లో, పశ్చిమ కనుమల్లో ఉండే ఈ ప్రాంతం.. కేరళ సౌందర్యానికి పట్టుగొమ్మలా కనిపిస్తుంది. కొండల మధ్య, సముద్ర మట్టానికి 3,400 అడుగుల ఎత్తులో ఉంటుంది. కొండవాలులో కాఫీ, తేయాకు తోటలు విస్తారంగా ఉంటాయి. వాటి మధ్యలో వంకలు తిరిగిన దారి.. కొత్త ఉత్సాహాన్నిస్తుంది. మరోవైపు పైన్‌ చెట్ల బారులు, చిన్నచిన్న జలపాతాలు పలకరిస్తూ ఉంటాయి. అందుకే వేగమాన్‌ చేరుకోగానే మనసు వేగం పెరుగుతుంది. కొండలన్నీ చకచకా ఎక్కేయాలనిపిస్తుంటుంది.
చూడాల్సినవి: 
* వేగమాన్‌ సమీపంలో మూడు పర్వతాలున్నాయి. వీటి పేర్లు తంగల్‌, మురుగన్‌, కురిసుమాల. ఈ మూడు గిరులపై మూడు మతాలకు చెందిన మందిరాలు దర్శనమిస్తాయి. తంగల్‌ పర్వతంపై ఓ దర్గా ఉంది. మురుగన్‌ కొండపై సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఉంటుంది. కురిసుమాల పర్వతంపై చర్చిని చూడొచ్చు.
* వేగమాన్‌లో బోలెడన్ని రిసార్టులు ఉన్నాయి. కొండల్లో క్యాంప్‌లు కూడా నిర్వహిస్తుంటారు. ఇక్కడికి సమీపంలో నాలుగైదు జలపాతాలు. సన్‌రైజ్‌, సన్‌సెట్‌ వ్యూ పాయింట్లు ఉన్నాయి. ట్యాక్సీల్లో వెళ్లొచ్చు. ట్రెక్కింగ్‌ పాయింట్లూ బోలెడున్నాయి.
చేరుకునేదిలా:
వేగమాన్‌.. కొట్టాయం నుంచి 66 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నుంచి కొట్టాయం వరకు రైళ్లున్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వేగమాన్‌ చేరుకోవచ్చు
.

Comments