పాతాళకోటకు పోదామా


‘‘అమ్మ కడుపు చల్లగా..’’ అక్కడ ఉన్నంత కాలం అంతా ప్రశాంతమే! గతం ఉండదు.. భవిష్యత్‌ గురించి ఆలోచన రాదు. ధరణి గర్భంలో ఉన్న పాతాళ్‌కోట్‌ కూడా చల్లగా ఉంటుంది. ఒక్కసారి అందులోకి తొంగిచూస్తే.. కల్మషం లేని మనుషులు కనిపిస్తారు. కాలుష్యం అంటని ప్రకృతి పలకరిస్తుంది. అరుదైన సంప్రదాయాలు ఎదురవుతాయి. అసలైన ఆనందమేంటో తెలుస్తుంది. చూసొద్దాం పదండి..

మధ్యభారతాన్ని పచ్చగా ఉంచుతున్న ప్రకృతి సంపద సాత్పురా పర్వత శ్రేణులు. దట్టమైన అడవులు, విస్తృత జలవనరులతో అలరారే ప్రాంతమిది. ఈ గిరుల్లోనే ఉంటుంది పాతాళ్‌కోట్‌. మధ్యప్రదేశ్‌ ఛింద్వాడా జిల్లా తామియా శివారు నుంచి మొదలవుతుందీ లోయ. సముద్రమట్టానికి 3,000 అడుగుల ఎత్తులో.. భూతలానికి 1,700 అడుగుల లోతులో ఉంటుంది. గుర్రపునాడా ఆకారంలో దాదాపు 80 చదరపు కిలోమీటర్లు విస్తరించిన కనుమలో.. 12 గ్రామాలు, పది దాకా గూడేలున్నాయి. మూడువేలకు మించని జనాభా ఉంటుంది. అందులో గోండ్లు కొందరైతే, భారియా జాతీయులు ఇంకొందరు. లోకం పోకడ పూర్తిగా తెలియని మనుషులు వీళ్లు. వనదేవతను నమ్ముకొని బతుకుతున్నవాళ్లు.

దిగే కొద్దీ..

తామియా వ్యూ పాయింట్‌ నుంచి చూస్తే పచ్చని చెట్ల మధ్యనున్న అగాధం ఆశ్చర్యపరుస్తుంది. అందులో నుంచి తేరుకోకముందే.. ఓ మెట్ల మార్గం లోయలోకి దారితీస్తుంది. 1,700 అడుగులు కిందికి వెళ్లాలి. రెండు కిలోమీటర్లు ముందుకుసాగాలి. అప్పుడు గానీ అసలు సౌందర్యం మొదలవ్వదు. మెట్లు దిగుతున్న కొద్దీ వచ్చే ఆయాసం.. చుట్టూ ఉన్న వింతలను చూడటంతో మాయమైపోతుంది. కాసేపటికి కాళ్లు నొప్పులనిపిస్తాయి. నెత్తిమీద మూటలతో చకచకా పైకి వెళ్లిపోతున్న గిరిజనులను చూడగానే మళ్లీ ఉత్సాహం పుంజుకుంటుంది. మెట్ల దారే కాకుండా.. రహదారి మార్గం కూడా ఉంది. కానీ, చాలామంది పాతాళ సోపానాల అవరోహణకే ప్రాధాన్యం ఇస్తారు.

పౌరాణిక విశేషాలు..

పాతాళ్‌కోట్‌లో ఎన్నెన్నో జలపాతాలు ఉన్నాయి. ఒకటి ఐదడుగుల ఎత్తు నుంచి జాలువారితే.. ఇంకోటి పాతిక అడుగుల నుంచి దూకుతూ అలరిస్తుంది. లోయలో గుహలెన్నో! ప్రధాన గుహకు పౌరాణిక ప్రాశస్త్యమూ ఉంది. రావణాసురుడి కొడుకు మేఘనాథుడు ఈ గుహలో తపస్సు చేశాడని చెబుతారు. ఇక్కడి నుంచే పాతాళానికి వెళ్లాడంటారు. లోయలోని ఆదివాసీలు తాము మేఘనాథుడికి వారసులమని భావిస్తారు. ఏటా మేఘనాథుడికి మేళా నిర్వహిస్తారు. శివుడు, సూర్యుడు, శక్తికి ప్రత్యేక సందర్భాల్లో ఉత్సవాలు చేస్తారు. ఈ వేడుకలు చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు పాతాళ్‌కోట్‌ చేరుకుంటారు. లోయలోని గుహలు, ఇతర ఆలయాలు చూడడానికి స్థానికులను గైడ్‌గా తీసుకెళ్లడం మంచిది. పాతాళ్‌కోట్‌ పర్యటనలో పేరున్న కట్టడాలు కనిపించకపోవచ్చు. మరబోట్లలో షికార్లు ఉండకపోవచ్చు. కానీ, మరో ప్రపంచాన్ని చూడొచ్చు. వనంతో గిరిజనానికున్న అనుబంధాన్ని తెలుసుకోవచ్చు. మక్కరొట్టె రుచిని ఆస్వాదించవచ్చు. చరవాణితో అనుబంధానికి కొంత విరామం ఇవ్వొచ్చు. అన్నిటికీ మించి.. అన్నీ మరచి ప్రశాంతంగా ఉండొచ్చు.

కొత్తతరం.. పాతదనం

1990 వరకు పాతాళ్‌కోట్‌ ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండేది కాదు. ఔషధ మూలికల కోసం వచ్చే శాస్త్రజ్ఞులు, ఆదివాసీల గురించి తెలుసుకునేందుకు వచ్చే పరిశోధకులు తప్ప దీని గురించి ఎవరికీ అంతగా తెలియదు. మూడు దశాబ్దాల నుంచి వారి జీవితాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. బడులు వెలిశాయి. పైకి, కిందికి రాకపోకలు పెరిగాయి. వ్యాపార లావాదేవీలు మొదలయ్యాయి. ఇప్పుడిప్పుడే టీవీలు నడుస్తున్నాయి. లీలగా సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ వస్తున్నాయి. ఈ తరం మనుషులు నవీనతను ఆహ్వానిస్తున్నా.. పాతదనాన్ని విడిచిపెట్టడం లేదు. సంప్రదాయాలను కఠినంగా పాటిస్తారు. దేవుళ్లు, నమ్మకాల విషయంలో భయభక్తులతో మెలుగుతారు. నేలతల్లి ఆరాధనలో ఆదర్శంగా నిలుస్తారు. వనదేవతకు రక్షకులుగా భావిస్తారు. అతిథి మర్యాదల్లోనూ అగ్రగాములే!

నాగలి పట్టరు.. పండు కొట్టరు..

పాతాళ్‌కోట్‌లో సూర్యుడు పదకొండు దాటిన తర్వాత గానీ కనబడడు. సాయంత్రం నాలుగు గంటలకే కనుమరుగైపోతాడు. దీంతో పగటి పూటలో సింహభాగం కొండల నీడల మాటునే కరిగిపోతుంది. నిండుగా ఉన్న పచ్చదనం, పెద్దగా లేని సూర్యుని ప్రభావం వెరసి.. పాతాళ్‌కోట్‌ శీతల విడిదిగా పేరొందింది. వర్షాకాలంలో వినీలాకాశంలో సాగే మేఘాలు.. ఇక్కడి పచ్చదనాన్ని చూసి హర్షించి.. ఘనంగా వర్షిస్తాయి. వానల రాకతో లోయలోని దూదీనది ఉప్పొంగుతుంది. జలపాతాల దూకుడు మొదలవుతుంది. పొలం పనులు వేగవంతం అవుతాయి. జొన్న, మొక్కజొన్న, సజ్జలు ప్రధానంగా వీళ్లు పండించే పంటలు. వ్యవసాయం చేస్తున్నా.. చాలామంది ఇప్పటికీ నాగలి పట్టరు. చేతులతోనే విత్తనాలు విత్తుతారు. లోయలో మామిడి చెట్లు, జామచెట్లు చాలా ఉంటాయి. ఈ చెట్లకు కాయలు విరగ్గాసినా.. కోయరు. పిల్లలు రాళ్లతో కొట్టరు. కాయ పండై.. నేల రాలితే గానీ ముట్టరు. ఆధునిక ప్రపంచంతో పరిచయం అయింది మొదలు.. వారిలో కొద్దిగా మార్పు వస్తున్నా.. ప్రకృతి దగ్గరికి వచ్చేసరికి పెద్దల మాటను పాటిస్తున్నారు.

పక్కనే పచ్‌మఢీ

పాతాళ్‌కోట్‌ సమీపంలో ఉన్న మరో అద్భుతం పచ్‌మఢీ. తామియా నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సులు, ట్యాక్సీల్లో వెళ్లొచ్చు. వనవాస కాలంలో పాండవులు పచ్‌మఢీలో కొన్నాళ్లున్నారని చెబుతారు. అద్భుత జలపాతాలు, అందమైన గుహలతో ఉన్న ఈ ప్రాంతం ‘సాత్పురా కీ రాణి’గా ప్రసిద్ధి చెందింది. ఏడాది పొడవునా పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.
పచ్‌మఢీలో చూడాల్సినవి..
  • పాండవ గుహలు
  • జటాశంకర గుహ
  • బడే మహాదేవ్‌ గుహ
  • రజత్‌ ప్రతాప్‌, అప్సర విహార్‌, బీ ఫాల్‌ జలపాతాలు
రాజేంద్రగిరి, దూప్‌గఢ్‌ పర్వతాలు

కొండపైన క్యాంప్‌

పాతాళ్‌కోట్‌కు మార్గం చూపే తామియాలో బస సౌకర్యం ఉంది. చాలా మంది ఉదయాన్నే లోయలోకి వెళ్లి సాయంత్రానికి మళ్లీ తామియాకు వచ్చేస్తారు. ఇక్కడ నైట్‌ క్యాంప్‌లు నిర్వహిస్తుంటారు. ట్రెక్కింగ్‌ ప్రియులు కలుసుకునే చోటూ ఇదే.

చేరుకునేదిలా: 

  • హైదరాబాద్‌ నుంచి నాగ్‌పూర్‌కు నాన్‌స్టాప్‌ విమాన సర్వీసులు ఉన్నాయి. 
  • హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నుంచి నాగ్‌పూర్‌కు రైళ్లున్నాయి.
  •  అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఛింద్వాడా మీదుగా తామియా (185 కి.మీ) చేరుకోవాలి. 
  • ఛింద్వాడా నుంచి తామియాకు బస్సులు, ట్యాక్సీలు ఉంటాయి. 
  • తామియా నుంచి పాతాళ్‌కోట్‌ లోయలోకి వెళ్లాలి.

Comments