ఒకే జర్నీ... ఒకటే టిక్కెట్...
ఒకటికి ఎనిమిది చోట్ల ఆగొచ్చు...
నచ్చిన ప్రదేశాలన్నీ చూడొచ్చు...
ఖర్చు తక్కువ... సౌలభ్యం ఎక్కువ...
బడ్టెట్ ట్రావెలర్‌కు భలే సౌకర్యం...
‘Circular Journey Ticket’ రండి...
ఎన్నో పర్యాటక, ఆధ్యాత్మిక గమ్యాలను ఒకే ట్రిప్పులో చూసేద్దాం అనుకుంటున్నారా? ఒకే ఛార్జీతో, నిర్ణీత కాల వ్యవధిలో కనీసం ఎనిమిది ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉందని మీకు తెలుసా? అవును! రైల్వే శాఖ సర్క్యులర్ టూర్ టిక్కెట్‌తో అలాంటి ఆఫర్ అందిస్తోంది. దేశంలో పుణ్యక్షేత్రాలకూ, విహార కేంద్రాలకూ, చారిత్రక వారసత్వ ప్రదేశాలకూ కొదవ లేదు. వీటిలో వీలైనన్ని ఎక్కువ పర్యాటక ప్రదేశాలను చూడాలనే ఆకాంక్ష చాలామందికి ఉంటుంది. అయితే ఒకేసారి ఎక్కువ ప్రాంతాలు చూడాలనుకున్న వారిని ప్రయాణ ఖర్చులూ, రిజర్వేషన్ ఇబ్బందులూ భయపెడతాయి. ఆలాంటి సమస్యలేవీ లేకుండా, ఒకే ఛార్జీతో, ఒకేసారి చేయించుకున్న రిజర్వేషన్లతో కొన్ని వేల కిలోమీటర్ల దూరం మధ్యలో ఉన్న ప్రదేశాలను ప్రయాణికులు సందర్శించే వీలు ‘సర్క్యులర్ జర్నీ టిక్కెట్’ ద్వారా అందుబాటులో ఉంది.
సర్క్యులర్ జర్నీ రెండు విధాలు:
- ఒకటి ఏయే ప్రాంతాలను చూస్తామో ముందుగా మనమే నిర్ణయించుకొని, ఆ వివరాలను రైల్వే అధికారులకు అందించి, దానికి అనుగుణంగా టిక్కెట్లు తీసుకోవడం!
- రెండవది ప్రయాణికుల అభిరుచులను దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ రూపొందించిన ప్రామాణిక (స్టాండర్డ్) సర్క్యులర్ జర్నీని ఎంచుకోవడం!!
- ధరలు చాలా తక్కువ. టెలిస్కోపిక్ పద్ధతిలో, బయలుదేరిన స్టేషన్ నుంచి చివరి స్టేషన్‌కూ, అక్కడి నుంచి మనం తిరిగివచ్చే రైల్వే స్టేషన్‌కూ... అంటే రానూపోనూ టిక్కెట్టు ధర మాత్రమే వసూలు చేస్తారు.
- మనం ఎంపిక చేసుకున్న రైల్వే స్టేషన్ నుంచి మనకు నచ్చిప్పుడు, నచ్చిన గమ్యాలకు వెళ్ళవచ్చు.
- మనం సందర్శించాలనుకొనే ప్రతి ఊరి రైల్వే స్టేషన్‌కూ టిక్కెట్ కొనక్కర్లేదు. పదే పదే రిజర్వేషన్లు చేయించుకోనక్కర్లేదు.
- సర్క్యులర్ జర్నీ టిక్కెట్టుతో గరిష్ఠంగా ఎనిమిది చోట్ల ఆగి (బ్రేక్ జర్నీ), మళ్ళీ ప్రయాణం ప్రారంభించవచ్చు.
- దీనివల్ల ఎంతో సమయం కలిసి వస్తుంది. బుకింగ్ కన్ఫర్మ్ అయిపోతుంది కాబట్టి నిశ్చింతగా ఉండవచ్చు.
- కనీసం వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించే సీనియర్ సిటిజన్లలో పురుషులకు నలభై శాతం, మహిళలకు యాభై శాతం రాయితీ కూడా ఉంటుంది.
- ముందుగా ప్రోగ్రామ్‌ను, అంటే... ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఆగాలి, ఏయే రోజుల్లో ఎక్కడ ఉండాలి, ఎంతమంది బయలుదేరాలి అనే అంశాలను నిర్ణయించుకోవాలి
- తరువాత, ప్రయాణం ఎక్కడ నుంచి ప్రారంభించాలనుకుంటున్నామో ఆ ప్రాంతంలోని (రైల్వే డివిజన్‌లోని) ప్రధాన రైల్వే స్టేషన్లలో డివిజనల్ కమర్షియల్ మేనేజర్‌ను లేదా చీఫ్ రిజర్వేషన్ సూపర్‌వైజర్‌నూ కలవాలి.
- స్టాండర్డ్ జర్నీ టిక్కెట్లయితే ఆ సంగతి తెలియజేయాలి. సొంతంగా రూపొందించుకున్న ప్రయాణాలయితే మన రాకపోకల వివరాలు, ఎప్పుడు ప్రయాణం మొదలుపెట్టి, ఎప్పుడు ముగిస్తాం తదితర వివరాలతో ఒక లేఖను అందజేయాలి.
- ప్రయాణ దూరాన్నీ, తదనుగుణంగా ఛార్జీలను వాళ్ళు లెక్కిస్తారు. వెళ్ళే ప్రదేశాలు, ఛార్జీల వివరాలతో స్టేషన్ మేనేజర్‌కు నిర్దేశిత ఫారమ్‌లో సమాచారం ఇస్తారు.
- ఆ ఫారమ్‌ను చూపించి, మనం ప్రయాణం ప్రారంభించే రైల్వే స్టేషన్‌లో సర్క్యులర్ జర్నీ టికెట్ కొనుక్కోవచ్చు.
- అయితే అది కేవలం మామూలు టిక్కెట్ మాత్రమే! రిజర్వేషన్‌కు గ్యారెంటీ ఉండదు. కాబట్టి రిజర్వేషన్ కౌంటర్‌కు వెళ్ళి, మనకు అనువుగా ఉన్న ట్రైన్లకు రిజర్వేషన్లు చేయించుకోవాలి.
- ప్రయాణం ఏ స్టేషన్ నుంచి ప్రారంభించామో అక్కడే ముగించాలి.
- ఈ టిక్కెట్ల మీద గరిష్ఠంగా ఎనిమిది స్టేషన్లలో (ప్రారంభమైన, తిరిగి చేరే స్టేషన్ మినహాయించి) బ్రేక్ జర్నీలు చేయవచ్చు.
- అయితే, కనెక్టింగ్ ట్రైన్ కోసం నిరీక్షిస్తూ, 24 గంటల కన్నా తక్కువ సమయం ఒక స్టేషన్‌లో ఆగినప్పుడు, దాన్ని బ్రేక్ జర్నీగా పరిగణించరు. ఆ వ్యవఽధిలో దగ్గర్లోని ప్రదేశాలను చూడవచ్చు.
- సర్క్యులర్ జర్నీలో ఒకసారి ప్రయాణించిన మార్గంలో మళ్ళీ ప్రయాణించకూడదు. తిరుగుప్రయాణం వేరే మార్గంలో ఉండాలి.
- ప్రతి సర్క్యులర్ జర్నీకీ ఒక నిర్దిష్టమైన కాలవ్యవధి ఉంటుంది. అది మనం ప్రయాణించే మొత్తం దూరం మీద ఆధారపడుతుంది.
- సగటున రోజుకు 125 కి.మీ. నుంచి 135 కి.మీ. మధ్య ప్రయాణ దూరాన్ని పరిగణనలోకి తీసుకొని ఆ కాల వ్యవధిని నిర్ణయిస్తారు. ఉదాహరణకు 8 వేల కి.మీ. దూరానికి ఈ వ్యవధి 60-64 రోజులు ఉంటుంది.
- ఆ వ్యవధి లోపల, మీరు తిరిగి మీ గమ్యాన్ని చేరుకొనే రోజుకు మధ్య... ఎక్కడ, ఎన్ని రోజులైనా బ్రేక్ జర్నీ చెయ్యవచ్చు.
- ప్రతి 200 కి.మీ. దూరానికీ ఒకసారి బ్రేక్ జర్నీ చేయవచ్చు.
- సర్క్యులర్ జర్నీ టిక్కెట్టును బుక్ చేసుకోవడానికి కనీస దూరం 1,500 కి.మీ., గరిష్ఠ దూరం 10,000 కి.మీ.
- ప్రయాణికులు వేర్వేరు తరగతుల్లో టిక్కెట్లు బుక్ చేసుకోవడం వల్ల జిఎస్‌టి తదితర పన్నుల లెక్కింపులో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని, స్లీపర్ క్లాసుకు మాత్రమే సర్క్యులర్ జర్నీ టిక్కెట్లు జారీ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిలో మార్పులు ఉండొచ్చు.
- ప్రయాణానికి ఎంచుకున్న స్టేషన్ల ఆధారంగా ఛార్జీలను లెక్కిస్తారు.
- మీరు ప్రయాణించే రోజు ఆధారంగా టిక్కెట్టు కాలపరిమితి ఆధారపడి ఉంటుంది.
- స్టాండర్డ్ సర్క్యులర్ జర్నీ టిక్కెట్లను, సదరన్ రైల్వే మినహా, మిగిలిన అన్ని రైల్వే జోన్లూ ఆఫర్ చేస్తున్నాయి.
- ఈ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించరు.
హైదరాబాద్ - సికంద్రాబాద్ నుంచి స్టాండర్డ్ సర్క్యులర్ జర్నీ మార్గాలు:
- హైదరాబాద్- మంత్రాలయం రోడ్డు - తిరుపతి- బెంగళూరు సిటీ- చెన్నై సెంట్రల్ - భద్రాచలం రోడ్డు - హైదరాబాద్ - దూరం 2,500 కి.మీ.
- హైదరాబాద్ - భద్రాచలం రోడ్డు - తిరుపతి - పుదుచ్చేరి - రామేశ్వరం- తిరుచందూరు- కన్యాకుమారి - మైసూరు - హుబ్లీ - హైదరాబాద్- దూరం 4,779 కి.మీ.
- సికింద్రాబాద్ - బీజాపూర్ - పండరీపురం - కొల్హాపూర్ - వాస్కోడిగామా - మైసూరు - తిరుపతి - చెన్నై సెంట్రల్ -భద్రాచలం రోడ్డు - హైదరాబాద్ - దూరం 4,100 కి.మీ.
- సికింద్రాబాద్ - మంత్రాలయం రోడ్డు - బెంగళూరు సిటీ - మైసూరు- హుబ్లీ - వాస్కోడిగామా- కొల్హాపూర్ - నాసిక్ రోడ్- ఔరంగాబాద్ - సికింద్రాబాద్ - దూరం 3,427కి.మీ.
- సికింద్రాబాద్- ముంబాయి - ఢిల్లీ - చండీగఢ్ - ఋషీకేశ్ - పూరి- తిరుపతి - రామేశ్వరం- కోయంబత్తూరు- సికింద్రాబాద్- దూరం 8,444 కి.మీ.
- హైదరాబాద్ - విజయవాడ- అన్నవరం- పూరి- భువనేశ్వర్ - టాటా నగర్ - గయ - వారణాసి- అలహాబాద్ - హైదరాబాద్ - దూరం 3,946 కి.మీ.
- సికింద్రాబాద్ - గుల్బర్గా - పండరీపురం- ముంబాయి సిఎస్‌టి/సెంట్రల్ - నాసిక్ రోడ్డు - మన్మాడ్ - ఔరంగాబాద్ - జల్నా ప్రభాని - సికింద్రాబాద్ - దూరం 1,830 కి.మీ.
- సికింద్రాబాద్- చెన్నై సెంట్రల్- ఉదకమండలం- మైసూర్- బెంగళూరు సిటీ - హుబ్లీ - వాస్కోడిగామా - ముంబాయి సిఎస్‌టి- షోలాపూర్ - హైదరాబాద్ - దూరం 3,870 కి.మీ
- సికింద్రాబాద్ - ఓంకారేశ్వర్ రోడ్డు -అజ్మీర్ - జైపూర్ - న్యూఢిల్లీ - కురుక్షేత్ర- జమ్ము తావి - మధుర - ఆగ్రా కంటోన్మెంట్- సికింద్రాబాద్ - దూరం 4,636 కి.మీ.
- హైదరాబాద్- వారణాసి - అయోధ్య - ఋషీకేశ్ - డెహ్రాడూన్ - చండీగఢ్ - కల్కా - న్యూ ఢిల్లీ - ఆగ్రా కంటోన్మెంట్- హైదరాబాద్ - దూరం 4,850 కి.మీ.
- సికింద్రాబాద్ - పర్లి వైద్యనాథ్ - నాసిక్ రోడ్డు- ఉజ్జయని- ఢిల్లీ - నైమిశారణ్యం- అయోధ్య - వారణాసి - సికింద్రాబాద్ - దూరం 5,223 కి.మీ.
- హైదరాబాద్ - పూరి - హౌరా - న్యూ జల్‌పాయ్‌గుడి - రక్స్వాల్- పాట్నా- గయ - వారణాసి - అలహాబాద్ - హైదరాబాద్ - దూరం 5,280 కి.మీ.
- హైదరాబాద్ - తిరుపతి- శ్రీరంగం- పళని - రామేశ్వరం- తిరుచందూరు- కన్యాకుమారి- మైసూరు - బెంగళూరు సిటీ- హైదరాబాద్ - దూరం 4,358 కి.మీ.
- కాచిగూడ - ఔరంగాబాద్ - ఉజ్జయని - భద్రాచలం రోడ్డు - తిరుపతి- చెన్నై సెంట్రల్ - బెంగళూరు సిటీ - మైసూరు - హుబ్లీ- సికింద్రాబాద్ - దూరం 4,665 కి.మీ.
- విజయవాడ -ముంబయ్- అజ్మీర్- జైపూర్ - ఆగ్రా ఫోర్ట్ - కంటోన్మెంట్ - ఢిల్లీ - వారణాసి - పూరి - విజయవాడ - దూరం 5,635 కి.మీ.
- విజయవాడ - పూరి - వారణాసి - అయోధ్య - నైమిశారణ్యం - ఋషీకేశ్ - ఢిల్లీ - మధుర - ఆగ్రా కంటోన్మెంట్ - విజయవాడ - దూరం 5,067 కి.మీ.
- విజయవాడ - తిరుపతి - మన్మాడ్- వెరవల్ - ద్వారక - ఉజ్జయని - ఢిల్లీ - ఋషీకేశ్ - పూరి - విజయవాడ - దూరం 8,268 కి.మీ.
- అనకాపల్లి - కన్యాకుమారి - తిరుచందూర్ - తెన్‌కాశి - మదురై - రామేశ్వరం - పళని - శ్రీరంగం - తిరుపతి - అనకాపల్లి - దూరం 4,027 కి.మీ.
- అనకాపల్లి - తిరుపతి - చెన్నై సెంట్రల్ - ఉదకమండలం - మైసూరు- బెంగళూరు సిటీ - మంత్రాలయం రోడ్డు - హైదరాబాద్ - అనకాపల్లి - దూరం 3,112 కి.మీ.
- గుంతకల్లు - పర్లి వైద్యనాథ్ - నాసిక్ రోడ్డు - ఉజ్జయని - న్యూ ఢిల్లీ - ఋషీకేశ్ - అయోధ్య - వారణాసి -సికింద్రాబాద్ - గుంతకల్లు - దూరం 5,902 కి.మీ.
- రాజమండ్రి - పూరి - హౌరా - న్యూ జల్‌పాయ్‌గుడి - పాట్నా - గయ - వారణాసి - అలహాబాద్ - విజయనగరం- రాజమండ్రి - దూరం 4,173 కి.మీ.
ఒకే ట్రిప్పులో, ఒకే టిక్కెట్టుతో అనేక ప్రదేశాలు చూసే అవకాశాన్ని ఈ సర్క్యులర్ టిక్కెట్లు అందిస్తాయి. ముఖ్యంగా యాత్రికులకూ, వివిధ ప్రాంతాలను సందర్శించాలని కోరుకొనే వారికీ ఇవి ఎంతో అనువుగా ఉంటాయి. సర్క్యులర్ జర్నీ టిక్కెట్లను వివిధ జోనల్ రైల్వేలు ఆఫర్ చేస్తాయి. గరిష్ఠంగా ఎనిమిది మజిలీలతో చేసే ప్రయాణాలు, ప్రామాణికమైన సర్క్యులర్ ప్రయాణాలకు మాత్రమే ఈ టిక్కెట్లు జారీ చేస్తారు.
Railway Rules Link : Circular Journey Ticket Rules
Comments
Post a Comment