HAppyగా వెళ్లొద్దాం



అప్లికేషన్ల రంగప్రవేశంతో.. అన్ని రకాల సేవలూ నిమిషాల మీద అందుతున్నాయి. విహారం సజావుగా సాగడానికి ఎన్నెన్నో యాప్‌లు ఉన్నాయి. కావాల్సినవి చరవాణిలో డౌన్‌లోడ్‌ చేసుకుంటే చాలు.. కాగల కార్యం తీర్చి పెడతాయి. టికెట్‌ బుకింగ్‌, హోటల్‌ బుకింగ్‌, ప్రయాణ ప్రణాళిక ఇలా పర్యటన పర్వంలోని అన్ని పనులూ అవే చక్కబెడతాయి. ఈ అప్లికేషన్లు అలాంటి సహకారం అందించేవే!

సరిగ్గా సర్దుకుపోదాం.. 
ప్రయాణం అనగానే.. ఏం సర్దుకోవాలో అర్థం కాదు. వస్తువులు ఎక్కువైతే బరువు పెరిగిపోతుంది. అలాగని ఏదైనా వదిలేస్తే.. మళ్లీ అవసరానికి ఉండదనిపిస్తుంది. ఈ సమస్యలేం లేకుండా ఉండాలంటే.. మీ చరవాణిలో ప్యాక్‌పాయింట్‌ (packpoint ) యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి. ఎన్ని రోజుల విహారానికి ఎంత లగేజీ ఉండాలి, ఏఏ వస్తువులు తీసుకెళ్లాలి, ఏ వస్తువులు ముఖ్యమైనవి, ఏవి అంతగా ప్రాధాన్యం లేనివి.. ఇలాంటి వివరాలన్నీ చెప్పేస్తుంది. యాప్‌లోని చెక్‌లిస్ట్‌లో చూస్తూ వస్తువులు సర్దేసుకోవడమే మనం చేయాల్సింది.
అప్పటికప్పుడు విడిది 
ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా.. విహారంలో ఒక్కోసారి అనుకోని పరిస్థితులు ఎదురవుతుంటాయి. అనుకోకుండా పర్యటన పొడిగించాల్సి వస్తుంది. పర్యాటక కేంద్రానికి చేరుకునేసరికి ఏ అర్ధరాత్రో అవుతుంది. అప్పటికప్పుడు బస దొరకడం అంటే మాటలు కాదు. అనువైన విడిది కోసం లాడ్జ్‌ల చుట్టూ తిరిగి విసుగొస్తుంది. ఈ సమస్య లేకుండా చేస్తుంది హోటల్‌ టునైట్‌ (hoteltonight) యాప్‌. దీని సాయంతో తక్కువ సమయంలో అనువైన బస బుక్‌ చేసుకోవచ్చు. ఆకర్షణీయమైన డీల్స్‌ను సొంతం చేసుకోవచ్చు.
దారిచూపే దేవత 
సొంత వాహనాల్లో పర్యటనకు వెళ్లినప్పుడు అంతా సజావుగానే ఉంటుంది. కానీ, దారి తెలియకపోతేనే అసలు సమస్య! దారిన పోయే వారందరినీ అడిగేస్తుంటాం. ఎవరో చెప్పిన మార్గంలో వెళ్లి.. వెనక్కి వచ్చే సందర్భాలెన్నో ఉంటాయి. మ్యాప్స్‌.మి (maps.me) యాప్‌ తోడుంటే.. అన్ని దారులూ రహదారులే. ఆఫ్‌లైన్‌లోనూ పని చేస్తుంది. వాయిస్‌ కమాండ్స్‌తో ఎటు వెళ్లాలో చెబుతుంది.

Comments